Trending

6/trending/recent

Free Vaccine: 18 ఏళ్లు దాటితే ఉచిత టీకా

  • ఖర్చంతా కేంద్రానిదే
  • ఈ నెల 21 నుంచి అమలు
  • రాష్ట్రాలకు 75% ఉచితంగా సరఫరా
  • 25% ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తాం
  • నవంబర్‌ వరకు పేదలకు ఉచిత రేషన్‌
  • ప్రధాని మోదీ వెల్లడి

Free Vaccine: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తనదేనని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలపై పైసా భారం పడదని తేల్చిచెప్పింది. ఈ నెల 21 నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో టీకా విధానంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, వివిధ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. సోమవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి 32 నిమిషాలసేపు ప్రసంగించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతాన్ని తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రాలు ఇక మీదట వ్యాక్సిన్ల కోసం పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఉచితంగా వద్దనుకొనేవారి కోసం 25% వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా అందించనున్నట్లు చెప్పారు. వారు వ్యాక్సిన్‌ గరిష్ఠ ధరపై రూ.150 మాత్రమే సేవా రుసుం తీసుకోవాలని స్పష్టం చేశారు. ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన’ ద్వారా 80 కోట్ల మంది నిరుపేదలకు నవంబర్‌ వరకు ఉచితంగా ఆహారధాన్యాలు ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు. 

రాష్ట్రాలు కోరితేనే మార్చాం

‘‘జనవరి 16 నుంచి మే 1 వరకు వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది. అందరికీ టీకాలు ఉచితంగా అందించాం. చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ను వికేంద్రీకరించాలని కోరాయి. ఏ వయసు వారికి వ్యాక్సిన్‌ అందించాలన్నది కూడా కేంద్రమే నియంత్రిస్తుందా అని ప్రశ్నించాయి. తమ ప్రయత్నమేదో తాము చేసుకుంటాం అని అన్నప్పుడు కేంద్రానికి అభ్యంతరం ఎందుకు ఉండాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా మార్పు చేశాం. వ్యాక్సిన్‌ లభ్యతలో ఉన్న ఇబ్బందులు, ప్రపంచవ్యాప్త పరిస్థితులు తెలిసివచ్చాక కొన్ని రాష్ట్రాలు మొదటి విధానమే మేలని చెప్పాయి. మేం కూడా ఆలోచించాం. వ్యాక్సినేషన్‌ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని నిర్ణయించాం.

మేం వచ్చాకే టీకాల్లో వేగం

గత 50-60 ఏళ్ల చరిత్రను చూస్తే భారత్‌కు విదేశాల నుంచి వ్యాక్సిన్లు రావడానికి దశాబ్దాలు పట్టేది. 2014లో దేశ ప్రజలు మాకు అవకాశం కల్పించేటప్పటికి వ్యాక్సినేషన్‌ విస్తృతి 60% వరకే ఉండేది. దీనిని 100 శాతానికి చేర్చాలంటే ఈ లెక్కన మరో 40 ఏళ్లు పట్టేది. మేం ‘మిషన్‌ ఇంద్ర ధనుష్‌’ ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 5-6 ఏళ్లలోనే వ్యాక్సినేషన్‌ కవరేజిని 90%కి పెంచాం. పేదలు, పిల్లల గురించి ఆలోచించి 100% టీకా దిశగా వెళ్తున్నాం. మన దేశం కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేయకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో? రెండో ఉద్ధృతికి ముందే మనం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వకపోతే ఏమయ్యేవారో ఆలోచించండి. వ్యాక్సిన్‌ తయారీ వేగాన్ని పెంచి, వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేస్తాం. భారత్‌ ఒక్క ఏడాదిలోనే రెండు మేడిన్‌ ఇండియా వ్యాక్సిన్లు రూపొందించింది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రారంభమైన వెంటనే లాజిస్టిక్‌, ఇతరత్రా సన్నద్ధతలు ప్రారంభించాం. సంస్థలకు అన్నివిధాలా సహకరించాం. పరిశోధనలకు ఆర్థికసాయం అందించాం. దేశంలో ఇప్పుడు ఏడు కంపెనీల ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ తయారీ విభిన్న స్థాయిల్లో ఉంది. డిసెంబరు నాటికి మొత్తం 187 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. లభ్యతను పెంచడానికి విదేశాల నుంచి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాం. పిల్లల కోసం రెండు టీకాల ట్రయల్స్‌ వేగం పుంజుకున్నాయి. నాసల్‌ వ్యాక్సిన్‌పైనా పరిశోధన జరుగుతోంది’’ అని మోదీ వివరించారు.

ముఖ్యమంత్రుల హర్షం

ప్రధాని ప్రకటనను పలు రాష్ట్రాలు, వివిధ వర్గాలు స్వాగతించాయి. ఇక అసమానతలు, తటపటాయింపులు తొలగిపోయి టీకాల కార్యక్రమం ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. ఇది సరైన నిర్ణయమని పార్టీలకు అతీతంగా పలు రాష్ట్రాల సీఎంలు హర్షం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతోనే కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కాంగ్రెస్‌ పేర్కొంది.

వ్యాక్సిన్‌పై రాజకీయాలు బాధాకరం

దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై పరిశోధనలు ప్రారంభమైన నాటినుంచి కొందరు వదంతులు సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిన తర్వాతా అనుమానాలను పెంచారు. ఇలాంటి వ్యాక్సిన్‌ రాజకీయాలన్నింటినీ దేశం చూసింది. ఇవి బాధాకరం. వదంతులు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకున్న అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మన నుంచి కరోనా ఇంకా పోలేదు. అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.

సీఎం జగన్‌ కృతజ్ఞతలు

ఈనాడు, అమరావతి: దేశంలో 18 సంవత్సరాలు దాటినవారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కొవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో వ్యాక్సినే ఏకైక ఆయుధం. వ్యాక్సినేషన్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, దీన్ని అత్యంత ప్రాధాన్యం గల జాతీయ అజెండాగా చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు’’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు.Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad