Trending

6/trending/recent

Editorial: పరీక్షల నిర్వహణ సరికాదు

Editorial: ఈనెల 7 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు హైకోర్టు జోక్యంతో వాయిదా పడినాయి. పరీక్షల విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలనే హైకోర్టు ఆదేశంతో వాయిదా వేయడం జరిగింది. ఇంటర్ పరీక్షల విషయమై హైకోర్టులో విచారణ జరగనున్నది. ఈ పరీక్షలు సైతం మళ్ళీ వాయిదా పడే అవకాశముంది. ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించే తీరుతామని ప్రకటనలు చేస్తోంది. కరోనా కేసులు కొనసాగుతున్న పరిస్థితిలో పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ని సహించలేక ప్రభుత్వం రాజకీయ ప్రతిష్ఠ కోసమే పరీక్షల నిర్వహణ పట్ల పట్టుదలకు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షల విషయంలో మొండి వైఖరి సరైంది కాదనే విమర్శను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా మొత్తం 15 రాష్ట్రాలు 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రద్దుకు నిరాకరిస్తోంది. 

పరీక్షలు రద్దు చేస్తే అందరినీ పాస్ చెయ్యాల్సి వస్తుంది, పరీక్షలు నిర్వహిస్తే కొందరు విద్యార్థులకు అధిక మార్కులు వస్తాయి, అవి వారి తదుపరి విద్యావకాశాలకు ఉపయోగపడతాయన్న ప్రభుత్వ వాదన వలన ఒరిగేదేమీ లేదు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే సగటున 94 శాతం మంది విద్యార్థులు పాస్ అవుతున్నారు. పదో తరగతి పరీక్షలను గ్రేడ్‌ల పద్ధతిలో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా విపత్తు వలన ఏర్పడిన ప్రతికూల పరిస్థితిలో పరీక్షలు నిర్వహించకపోతే మిగిలిన 6 శాతం మంది విద్యార్థులు కూడా కనీస గ్రేడ్‌తో పాసవుతారు. పరీక్షలు రద్దయినా ప్రత్యామ్నాయంగా ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇచ్చే గ్రేడ్ పాయింట్స్ విద్యార్థి ప్రతిభకు ప్రామాణికంగానే ఉంటాయి కనుక, ఏ విద్యార్థికీ నష్టం జరిగే అవకాశం లేదు. ఇంటర్మీడియెట్ కోసం ప్రైవేట్ కాలేజీల్లో చేరడానికి ఫీజు ప్రధానం తప్ప గ్రేడ్ ఏదైనా సరిపోతుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు దొరకవనే సమస్య లేదు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కోసం అవసరమైతే గత ఏడాది లాగే అడ్మిషన్ టెస్ట్ పెట్టుకోవచ్చు. కనుక పది పరీక్షలు రద్దయినా తదుపరి విద్యావకాశాలకు ఎదురయ్యే అవరోధం ఏమీ లేదు. అయినా సీబీఎస్ఈ పాఠశాలల్లో చదివించుకుంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు వంటి సంపన్నులు, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు లేని పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని జిల్లా పరిషత్, గిరిజన, మునిసిపల్ రెసిడెన్షియల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఎందుకు నిర్వహించాలి? ఇదో రకం వివక్ష కాదా? ఒక రాష్ట్రంలోని విద్యార్థుల్లో కొందరిని పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసి మరి కొందరిపైన పరీక్షల ఒత్తిడి కొనసాగించడం అన్యాయం కాదా? 

పరిస్థితి ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడే పరీక్షలు పెడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసే వాదన ఫాల్స్ ప్రెస్టేజికి సంబంధించింది మాత్రమే. నిర్దిష్ట కాల పరిమితి కంటే ఎక్కువ రోజులు పరీక్షల కోసం చదవడం విద్యార్థులకు మానసిక వేదనే. పరీక్షల మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. రేపో మాపో కరోనా కేసులు తగ్గిపోయి పరిస్థితి చక్కబడితే ఇంటర్, డిగ్రీ కాలేజీలు ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడు పరీక్షలు పెట్టి, పేపర్లు దిద్ది, ఫలితాలు ప్రకటించేసరికి మళ్ళీ మూడో అల వచ్చిపడితే? అప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారే ప్రమాదం దాపురిస్తుంది. సీబీఎస్ఈ స్కూళ్లలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో అయినా పై తరగతులు చదువుకొంటూ ఉంటే ఎస్ఎస్‌సి బోర్డు విద్యార్థులు సంక్షోభంలో సతమతం కావాల్సి వస్తుంది. కరోనా కేసులు ఎక్కువగానే నమోదైన రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థుల పరీక్షల కోసం పట్టుబట్టడం సబబు కాదు. ‘పరీక్షల కన్నా ప్రాణాలు మిన్న’ అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలి.

- నాగటి నారాయణTags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad