Trending

6/trending/recent

Parliament winter sessions: ఒక బిల్లు పార్లమెంట్‌లో ఎలా చట్టంగా మారుతుంది? ఎంత సమయం పడుతుంది? పూర్తి వివరాలివే..

 Knowledge News: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే పలు కొత్త చట్టాలను పార్లమెంటు ఆమోదించింది. అందులో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులు కూడా ఉన్నాయి. అయితే ఒక బిల్లు చట్టం ఎలా అవుతుందో తెలుసా? బిల్లు చట్టంగా మారే ప్రక్రియ ఏమిటి? అసలు ఈ బిల్లులను ఎవరు ప్రవేశపెడతారు? చట్టంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.

బిల్లును ఎవరు ప్రవేశపెడతారు?

పార్లమెంటులో ఏదైనా చట్టాన్ని ఆమోదించాలంటే లోక్‌సభ లేదా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలి. పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ లేదా రాజ్యసభ) ఎవరైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కేంద్ర మంత్రి బిల్లును ప్రవేశపెడితే దానిని ప్రభుత్వ బిల్లుగానూ, ఎంపీ బిల్లును ప్రతిపాదిస్తే దానిని ప్రైవేట్‌ బిల్లుగానూ పరిగణిస్తారు. ఇక బిల్లు చట్టంగా మారే ప్రక్రియ విషయానికొస్తే.. సాధారణంగా పార్లమెంట్‌లో ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే మూడు దశలు పడుతుంది.. మొదటి దశలో బిల్లును సభలో ప్రవేశపెట్టాలి. ప్రతిపాదన ఆమోదం పొందినప్పుడు, బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఏదైనా బిల్లును ఉభయ సభలు అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాల్సి ఉంటుంది. అందుకని ఒక సభలో ఆమోదం పొందిన తర్వాత మరో సభలో కూడా ప్రవేశపెడతారు. ఆ తర్వాత దాదాపు అన్ని బిల్లులు మూడు నెలల పాటు విచారణ మరియు నివేదికల కోసం డివిజనల్ స్టాండింగ్ కమిటీలకు పంపిస్తారు. కమిటీకి నివేదిక అందిన తర్వాత రెండో రీడింగ్‌ ప్రారంభమవుతుంది. అందులో బిల్లును హౌస్ సెలక్షన్ కమిటీకి పంపాలా లేక ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపాలా వద్దా అని సభ నిర్ణయిస్తుంది. ఆతర్వాత బిల్లుపై సభ్యులందరి అభిప్రాయాలను తీసుకుంటారు.

రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..

బిల్లులోని ప్రతి క్లాజును చదివి వినిపించి బిల్లులో చేయాల్సిన సవరణలపై సభ్యుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు సేకరిస్తారు. ఇక, మూడో దశలో బిల్లులో ఏమైనా సవరణల చేయాల్సి ఉంటే చేస్తారు. లేదంటే నేరుగా సభ ఆమోదిస్తుంది. బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు చట్టంగా మారుతుంది.

అయితే రాష్ట్రపతి ఈ బిల్లులను ఆమోదించవచ్చు లేదా పరిశీలనలో ఉంచవచ్చు. అదేవిధంగా పునఃపరిశీలించవలసిందిగా పార్లమెంటును కోరవచ్చు. అయితే తిరిగి వచ్చిన బిల్లు ఉభయ సభల్లో మళ్లీ ఆమోదం పొందితే, రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. 2017 నివేదిక ప్రకారం పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత, అది ప్రభావవంతమైన చట్టంగా మారడానికి సగటున 261 రోజులు పడుతుంది.

ఆర్థిక బిల్లుల విషయంలో..

రాజ్యాంగం ప్రకారం, లోక్​ సభ, రాజ్య సభ రెండింటికీ సమానమైన అధికారాలుంటాయి. అయితే, కొన్ని ప్రత్యేకమైన బిల్లులు కేవలం లోక్‌సభలో ఆమోదం లభిస్తే సరిపోతుంది. అందులో ఆర్థిక బిల్లులు (మనీ బిల్లులు) ఒకటి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లో ఈ మనీ బిల్లు గురించి ప్రస్తావన ఉంది. అయితే ఏ బిల్లును మనీ బిల్లుగా పేర్కొనాలనే అధికారిక నిర్ణయం స్పీకర్‌ చేతిలో ఉంటుంది. కాగా లోక్‌సభ మనీ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపిస్తుంది. రాజ్యసభ ఎలాంటి సిఫార్సులు, మార్పులు చేర్పులు లేకుండానే 14 రోజుల వ్యవధిలో దానిని తిరిగి లోక్​సభకు పంపాలి. సదరు మనీ బిల్లును రాజ్యసభ తిరస్కరించినా సరే అది లోక్​సభలో ఆమోదం పొందితే చాలు ఆమోదం పొందినట్లే. అంతేకాదు, రాజ్యసభ 14 రోజుల్లోగా బిల్లును లోక్​సభకు పంపినప్పటికీ.. పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad