Trending

6/trending/recent

Employee Demands: సర్కారుతో ఢీ! ఇక ఉద్యోగ సంఘాల ఉద్యమ భేరి!!

 • దశలవారీ ఆందోళనలకు శ్రీకారం
 • ఎల్లుండి నుంచి జనవరి 6 వరకు తొలి దశ 
 • 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు
 • 7 -10 మధ్య నల్ల బ్యాడ్జీలతో నిరసన
 • 13న మండలాలు, డివిజన్లలో ర్యాలీలు
 • 21న జిల్లా స్థాయిలో మహాధర్నాలు
 • ఆ తర్వాత విశాఖ, తిరుపతి,
 • ఏలూరు, ఒంగోలుల్లో సభలు 
 • ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి ప్రకటన
 • పీఆర్‌సీ నివేదికకు అతీగతీ లేదు
 • డీఏ బకాయిలకూ దిక్కులేదు
 • జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులేవీ?
 • రేపు, మాపు అంటూ వాయిదాలు
 • 1న జీతాలే ఇవ్వలేని పరిస్థితి: బండి
 • ఎవరి శక్తి ఏమిటో చూపిస్తాం
 • ఆర్థిక మంత్రి ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడుతున్నారు
 • అన్ని జిల్లాల ఉద్యోగులతో మాట్లాడాం
 • వారి భరోసాతోనే ఉద్యమం: బొప్పరాజు

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికిచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలోనే ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగ నాయకత్వాలతో సమావేశాలు నిర్వహించాం. ఇరు జేఏసీల భేటీల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనుభవిస్తున్న అవమానాలు చాలని, తక్షణం ఉద్యమానికి ఉద్యుక్తులు కావాలని వారంతా బలంగా డిమాండ్‌ చేశారు.

- ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు

విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంతో అమీతుమీకి ఉద్యోగ సంఘాలు  సిద్ధమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించకుండా మడమ తిప్పడంపై పోరాటానికి సమాయత్తమయ్యాయి. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలు, ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియడంతో.. రెండు ప్రధాన జేఏసీలు.. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ.. తక్ష ణ కార్యాచరణ దిశగా విజయవాడలో వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. ఉదయం నగరంలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి, మధ్యాహ్నం ఏపీ ఎన్జీవో భవన్‌లో ఏపీ జేఏసీ అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. తమ ఉద్యోగులు, జేఏసీల పరిధిలోని ఉద్యోగసంఘాలతో విస్తృతంగా చర్చించి అభిప్రాయ సేకరణ జరిపాయి. సాయంత్రం ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం ర్యాలీగా ఏపీ ఎన్జీవో భవన్‌కు చేరుకుంది. అక్కడ రెండు జేఏసీలు ఉమ్మడిగా సమావేశమై.. ఉద్యమానికి సంబంధించి తొలిదశ కార్యచరణపై నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబరు 1వ తేదీ నుంచి జనవరి 6 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారుచేశాయి. అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, హృదయరాజు, వైవీ రావు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీసు ఇస్తామన్నారు. డిసెంబరు 7 నుంచి 10 వరకు అన్ని ఆఫీసులు, స్కూళ్లు, తాలూకా పరిధిలోని ఆఫీసులు, డివిజన్‌, జిల్లా స్థాయి ఆఫీసులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఏపీఎ్‌సఆర్‌టీసీ డిపోల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు. డిసెంబరు 13వ తేదీన అన్ని మండల, డివిజన్ల స్థాయుల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, కాన్ఫరెన్సులు నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 16న తాలూకా, డివిజన్‌, అధికారుల కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 21న జిల్లా స్థాయిలో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబరు 27న విశాఖపట్నంలో సాయంత్రం 4 గంటలకు సభ జరుగుతుందని.. 30వ తేదీన తిరుపతిలో, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇదిగో అదిగో అంటూ..: బండి

ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అక్టోబరు 7న పోరాటం చేస్తామని చెప్పామని, నవంబరు 27వ తేదీ వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చామని బండి శ్రీనివాసరావు గుర్తుచేశారు. ‘ఆ తర్వాత రెండు జేఏసీలు కలిసి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లాం. అక్టోబరు నెలలోనే పీఆర్‌సీ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. జేఏసీల సమావేశంలో కూడా నెలాఖరులోపు ఇస్తామన్నారు. పీఆర్‌సీ నివేదిక అడిగితే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వాయిదాలు వేస్తూ నివేదికను మాత్రం బయట పెట్టడం లేదు. రెండ్రోజుల్లో ఇస్తామని చీఫ్‌ సెక్రటరీ చెప్పారు. ఆయనపై గౌరవంతో ఓపిక పట్టాం. అయినా మాకు పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేదు..  ప్రకటించలేదు. డీఏ బకాయులు, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆర్థిక సమస్యలే కాకుండా ఆర్ధికేతర సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియటంతో రెండు జేఏసీలు వేర్వేరుగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించాయి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమంలోకి దిగుతున్నాం’ అని వెల్లడించారు.

అవాకులు, చవాకులూ సరికాదు: బొప్పరాజు

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి 95 శాతం మంది ఉద్యోగులతో అతిపెద్ద ఐక్యకూటమిగా ఉన్నాయని.. ప్రభుత్వాన్ని తామేదో బెదిరిస్తున్నామని, ప్రభుత్వం బెదిరిపోదని అనుభవరాహిత్యం కలిగిన ఓ చిన్న నాయకుడు అవాకులు చవాకులు పేలడం సరికాదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆ చిన్న నేతకు నిదానంగా అనుభవం వస్తుందని చెప్పారు. ‘మిగిలిన సంఘాలు కూడా భవిష్యత్‌ పోరాటంలో కలిసి రావలసిందే. రావాలని కోరుకుంటున్నాం. పిల్ల నేతలు మాట్లాడినట్లుగా ఉద్యమంలో ఎవరి శక్తి ఏమిటో చూస్తారు. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలోనే ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగ నాయకత్వాలతో సమావేశాలు నిర్వహించాం. ఇరు జేఏసీల భేటీల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఉద్యోగులు అనుభవిస్తున్న ఈ అవమానాలు చాలని, తక్షణం ఉద్యమానికి ఉద్యుక్తులు కావాలని బలంగా డిమాండ్‌ చేశారు. అండగా ఉంటామని తేల్చి చెప్పారు. గత రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులతో చర్చించినప్పటికీ ఆర్థిక, ఆర్థికేతర ఏ సమస్యా కూడా పరిష్కారం కాలేదు. ఉద్యోగులు దాచుకున్న రూ.1,600 కోట్లను కూడా చెల్లించలేదు. పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉద్యోగ సంఘాలకు విలువ, ప్రాధాన్యం లేకపోవడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఆర్థిక మంత్రి ఉద్యోగులను అవమానించేవిధంగా మాట్లాడుతున్నారు. పేద వర్గాలు, ఉన్నత వర్గాలు అంటూ విడదీస్తూ ఉద్యోగులను కించపరచడం తగదు. ప్రభుత్వం చేసే చట్టాలను అమలు చేసేది ఉద్యోగులే. మాకు కూలీగా ఇవ్వాల్సింది మాత్రమే  అడుగుతున్నాం. మమ్మల్ని ప్రభుత్వంలో భాగంగా గుర్తించకపోవడం దురదృష్టకరం. కరోనా సమయంలో వేలాది మంది చనిపోయినా.. ప్రభుత్వ పథకాల అమలు కోసం పని చేశాం. కారుణ్య నియామకాలు జరపకపోయినా పని చేశాం. ఆఖరుకు పీఆర్‌సీ నివేదిక కూడా ఇవ్వకపోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. కాగ్‌ ఇచ్చే నివేదికలను కూడా బహిర్గతపరుస్తున్నప్పుడు.. పీఆర్‌సీ నివేదికలను ఎందుకు బయపెట్టరు’ అని ప్రశ్నించారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చాలా సమయం ఇచ్చామన్నారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగులకు అమలు చేస్తున్న హెల్త్‌ కార్డు అనారోగ్య కార్డుగా మారిపోయిందన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేవిధంగా కొందరు వ్యవహరిస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వైవీ రావు ధ్వజమెత్తారు. ఉదారంగా సమస్యలు పరిష్కరించాలని కోరడం లేదని.. చట్టపరంగా ఇచ్చేవి, ఇవ్వాల్సినవి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగుల సమస్యలు అనేకం ఉన్నాయని, చివరకు పెన్షన్‌ లేకుండా పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. సమస్యలపై ఎప్పుడడిగినా దీపావళి తర్వాత, సీఎం ఒడిసా పర్యటన తర్వాత అని.. ఫలానా రోజు రండని.. ఆ రోజు వెళ్తే మరో రోజుకు వాయిదా వేయడం తప్పితే పట్టించుకోవడం లేదు.

రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల జేఏసీలు సంఘటితమైన దరిమిలా.. పరిస్థితి తీవ్రతను గ్రహించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఉద్యమానికి మా బాధ్యత ఎంత మాత్రం లేదు. సర్కారే బాధ్యత వహించాలి.

- ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad