Trending

6/trending/recent

Aided Schools Willing Withdrawal: సమ్మతిని వెనక్కి తీసుకుంటున్న యాజమాన్యాలు

  •  తీవ్ర ఒత్తిడితోనే సమ్మతి తెలిపాం!

అమరావతి: ఆస్తులతో సహా లేదా సిబ్బందిని వెనక్కి ఇవ్వాలని ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఒత్తిడి చేయబోమని, అప్పగించని వాటికి గ్రాంట్‌ కొనసాగిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో కొన్ని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయి. గతంలో ఇచ్చిన సమ్మతిని వెనక్కి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు లేఖలు రాస్తున్నాయి. సుమారు 26 సంస్థలు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 6 జిల్లాల్లో  విద్యా సంస్థలు కలిగిన రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌(ఆర్‌సీఎం) పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి లేఖ రాసింది. మరో 15 ఇతర యాజమాన్యాలు అదేబాటలో ఉన్నాయి. ఇదే సమయంలో ఎయిడెడ్‌ పాఠశాలలను కొనసాగించాలని విద్యార్థులతల్లిదండ్రులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

చాలాచోట్ల పునరాలోచన

ఒత్తిడి కారణంగానే తమ సిబ్బందిని అప్పగించామని పేర్కొంటూ డయాసిస్‌ ఆఫ్‌ నెల్లూరు సొసైటీ అక్టోబరు 4న పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి లేఖ రాసింది. ఈ సొసైటీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 34 పాఠశాలలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 20 పాఠశాలల ద్వారా వందేళ్లుగా పేదలకు విద్యనందిస్తున్న ది రోమన్‌ క్యాథలిక్‌ డయాసిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డెక్కన్‌ సొసైటీ విజయవాడ తమకు ఎయిడ్‌ను కొనసాగించాలని ఈనెల 5న విద్యాశాఖను కోరింది. గుంటూరులో రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌కు 70 వరకు పాఠశాలలు ఉండగా గతంలో ఇచ్చిన సమ్మతి లేఖలను వెనక్కి తీసుకుంటామని కోరుతోంది. ఇదే జిల్లాలో మరో 12 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఎయిడ్‌ కొనసాగించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 9 యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఎయిడెడ్‌ కొనసాగించాలని విశాఖపట్నంలో మొదలైన ఆందోళన తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు పాకింది. రాష్ట్రంలో తొలిసారిగా అక్టోబరు 25న విశాఖలోని సేక్రెడ్‌ప్ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికల ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు ఆరు గంటలపాటు బైఠాయించగా అధికారులు దిగొచ్చారు. అనంతరం 26న కాకినాడలోనూ తల్లిదండ్రులు రోడ్డెక్కారు. జగన్నాథపురంలోని సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ బాలికల ఉన్నత పాఠశాలకు గ్రాంట్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం పాఠశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని 28, 29న రెండు రోజులపాటు నిరసనలు తెలిపారు. విశాఖనగరం టీపీటీ కాలనీలోని వసంతబాల విద్యోదయ, చిత్తూరు జిల్లా నిండ్ర మండలం శ్రీరామాపురం పాఠశాలలకు గ్రాంట్‌ను కొనసాగించాలని 29న తల్లిదండ్రులు, గ్రామస్థులు గళమెత్తారు.

‘‘ఒత్తిడితోనే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాం. సమ్మతి తెలపని వాటికి గ్రాంట్‌ని కొనసాగిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చినందున... పోస్టులను అప్పగిస్తూ గతంలో ఇచ్చిన అంగీకార పత్రాన్ని వెనక్కి తీసుకుంటాం’’

- పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి డయాసిస్‌ ఆఫ్‌ నెల్లూరు సొసైటీ లేఖ

‘‘కృష్ణా జిల్లాలో 1917 నుంచి ఎయిడెడ్‌ పాఠశాలలతో అక్షరాస్యత పెంపుదలకు విశేషంగా కృషి చేస్తున్నాం. మేం    నిర్వహించలేక బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించలేదు. తీవ్ర ఒత్తిడి, భయంతోనే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అప్పగిస్తూ లేఖ ఇచ్చాం’’

- ది రోమన్‌ క్యాథలిక్‌ డయాసిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డెక్కన్‌ సొసైటీ విజయవాడ లేఖ

మొత్తంగా ఇదీ పరిస్థితి...

రాష్ట్రంలో ఎయిడెడ్‌లో 2,249 డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌, పాఠశాలలు ఉండగా... వీటిలో 64% యాజమాన్యాలు కేవలం సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపాయి. వంద సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామన్నాయి. 703 సియాజమాన్యాలు ఎలాంటి అంగీకారం తెలపలేదు.

West Godavari RCM Unwilling Letter



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad