Trending

6/trending/recent

2DG Medicine: ఐఐసీటీ నుంచి 2డీజీ ఔషధం

  • తయారీ దశల తగ్గింపు
  • ఉత్పత్తికి లీ ఫార్మా ఒప్పందం

2DG Medicine: కొవిడ్‌ రోగులపై సమర్థంగా పనిచేస్తున్నట్లు చెబుతున్న 2 డీజీ ఔషధ తయారీ ప్రక్రియను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)మరింత మెరుగుపర్చింది. దీంతో ప్రాసెసింగ్‌ ప్రక్రియ వ్యవధి 30 శాతం తగ్గడంతో పాటు తయారీ సమర్థత పెరిగింది. ఏకంగా మూడు దశలు తగ్గాయి. రసాయనాల వాడకం, ముడి పదార్థాల వృథా తగ్గడమే కాకుండా తక్కువ మానవ వనరుల వినియోగంతో ఔషధ ధర మరింత దిగిరానుంది. వాస్తవానికి 2 డీయాక్సీ 2 గ్లూకోజ్‌ ఔషధం కొత్తది కాదు. దీని ప్రాసెస్‌ పేటెంట్‌ని ఐఐసీటీ 2003లోనే పొందింది. అప్పట్లో ఐదు దశల్లో ప్రాసెస్‌ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు దీన్ని రెండు దశలకు తగ్గించింది. దేశీయంగా దొరికే ముడి సరకులతోనే దీన్ని ఉత్పత్తి చేయవచ్చు. దీంతో పలు ఔషధ కంపెనీలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లీ ఫార్మా సంస్థ తాజాగా ఐఐసీటీతో నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. అనుమతి రాగానే ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. విశాఖపట్నంలోని దువ్వాడ సెజ్‌లో ఉత్పత్తి చేసేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేసుకుంది. ‘2డీజీపై 2003లోనే ఐఐసీటీకి  ప్రాసెస్‌ పేటెంట్‌ ఉంది. ఇటీవల డీఆర్‌డీవో ఈ ఔషధాన్ని కొవిడ్‌ రోగులపై పరీక్షించడంతో బాగా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో ఐఐసీటీ దీనిపై దృష్టిపెట్టింది. పాత విధానాన్ని మెరుగుపర్చి ప్రాసెస్‌ దశలను తగ్గించడంతో సమర్థత పెరిగింది. ఫార్మా సంస్థతో తాజా ఒప్పందంతో కొవిడ్‌కు మరింత సరసమైన ధరలో చికిత్సకు దోహదం చేస్తుంది’ అని ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

ప్రయోగాల దశలో మరో ఔషధం

కొవిడ్‌పై పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన మరో ఔషధం నిక్లోసామైడ్‌. చిన్నపిల్లల కడుపులో పురుగులు ఉంటే నయం చేసేందుకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తుంటారు. లండన్‌లోని కింగ్స్‌ కళాశాలకు చెందిన బృందంతో కలిసి కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిశోధన చేపట్టగా కొవిడ్‌ వైరస్‌ను అడ్డుకుంటున్నట్లుగా తేలింది. ఈ ఔషధ తయారీకి అవసరమైన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియంట్‌(ఏపీఐ)ని ఐఐసీటీ మెరుగుపర్చిన టెక్నాలజీ సాయంతో లాక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ తయారు చేసింది. రెండో దశలో క్లినికల్‌ ట్రయల్స్‌లో ఐఐసీటీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad