Trending

6/trending/recent

2-DG drug: కరోనా మెడిసిన్ 2-డీజీ ఎలా పనిచేస్తుంది? కరోనా చికిత్సలో ఇది కీలకంగా మారనుందా? పూర్తి వివరాలు

2-DG drug:  కోవిడ్-19 ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోకుండా ఇది కాపాడుతుందని డీఆర్‌డీఓ పరిశోధకులు తెలిపారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో, డీఆర్‌డీఓ విడుదల చేసిన 2డీజీ మందుపై వైద్య నిపుణులు దృష్టి సారించారు. త్వరలోనే కరోనా చికిత్సలో దీన్ని చేర్చే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సోమవారం 2-డీజీ డ్రగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ యాంటీ కోవిడ్ డ్రగ్‌ పూర్తి పేరు.. 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-deoxy-D-glucose). దీన్నే 2-DG అని పిలుస్తున్నారు. ఈ మందుల మొదటి బ్యాచ్‌ను ఇప్పటికే విడుదల చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1న దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్-19 ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోకుండా ఇది కాపాడుతుందని డీఆర్‌డీఓ పరిశోధకులు తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ సహకారంతో DRDO ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. సంస్థకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ల్యాబ్.. 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కోవిడ్-19తో బాధపడుతున్న ప్రజలకు ఈ ఔషధం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని డీఆర్‌డీఓ తెలిపింది.

* మందు ఎలా పని చేస్తుంది?

కరోనా సోకి, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులు వేగంగా కోలుకోవడానికి ఈ మందు ఉపయోగపడుతుందని డీఆర్‌డీఓ తెలిపింది. 2-డీజీ డ్రగ్ వైరస్‌ ప్రభావాన్ని నిరోధిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైంది. రోగులకు ఆక్సిజన్‌ అవసరాన్ని 2-డీజీ తగ్గిస్తుంది. ఈ మందు వైరస్‌ వ్యాపించిన కణాలకు గ్లూకోజ్‌ అందకుండా చేసి, వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రోగుల్లో తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడవు. వైరస్ వ్యాపించిన కణాల్లోకి మందు వెళ్తుంది. అక్కడ కణాలకు అవసరమైన శక్తి అందకుండా చేయడం ద్వారా, 2-డీజీ మందు వైరస్ వృద్ధిని ఆపేస్తుంది.

* క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు జరిగాయి?

గత ఏడాది ఏప్రిల్‌లో మహమ్మారి మొదటి దశలో విజృంభించిన సమయంలోనే ఈ ఔషధంపై ప్రయోగాలు మొదలయ్యాయి. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే SARS-CoV-2 మూల వైరస్ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), INMAS-DRDO శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ ప్రయోగాలు నిర్వహించారు. వ్యాధికి కారణమయ్యే కరోనావైరస్ కణాలను నిర్వీర్యం చేయడంపై అధ్యయనాలు కొనసాగాయి.

2-డీజీ మందు వైరల్ సింథసిస్‌ను అడ్డుకోవడం ద్వారా, వైరల్ లోడ్‌ను నిరోధిస్తుందని మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అనంతరం గతేడాది మే నెలలో DCGIకి చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO).. కోవిడ్ -19 రోగులపై 2-DG రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను అనుమతించింది. డాక్టర్ రెడ్డీస్, డీఆర్‌డీఓ సంయుక్తంగా ఈ పరీక్షలు చేశాయి. అనంతరం గత ఏడాది మే నుంచి అక్టోబర్ వరకు 110 మంది రోగులపై నిర్వహించిన రెండో దశ ట్రయల్స్ విజయవంతమైనట్లు ప్రభుత్వం తెలిపింది.

క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా, 2020 నవంబర్ 3న DCGI మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించింది. 2020 డిసెంబర్ నుంచి మార్చి వరకు.. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 27 కోవిడ్ ఆసుపత్రులలో చేరిన 220 మంది రోగులపై చివరి దశ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాల ఆధారంగా 2-డీజీ సమర్థంగా పనిచేస్తున్నట్లు డీఆర్‌డీఓ పరిశోధకులు నిర్ధారించారు.

* ట్రయల్స్ డేటా ఏం చెబుతోంది?

కోవిడ్-19 రోగులకు 2-డీజీ ఔషధం ఇచ్చే రక్షణ, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. వ్యాధి సోకిన వారిపై ఇది సురక్షితంగా పనిచేస్తున్నట్లు దీంట్లో కనుగొన్నారు. ఇన్‌ఫెక్షన్ నుంచి మందు గణనీయమైన రక్షణకు రక్షణను ఇచ్చిందని పరిశోధకులు తెలిపారు. రోగులు కోలుకోవడానికి 2-డీజీని వాడొచ్చని ట్రయల్స్‌పై ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తెలిపింది. స్టాండర్డ్ ఆఫ్ కేర్ (SoC) చికిత్స అందించిన వారికంటే వేగంగా రోగుల్లో వ్యాధి లక్షణాలు తగ్గాయని, SoCతో పోల్చినప్పుడు 2.5 రోజుల కంటే వేగంగా రోగులు కోలుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ మందు తీసుకున్న వైరస్ బాధితులకు ఆక్సిజన్ థెరపీ అవసరం ఉండదని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా వెల్లడించింది. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న రోగుల్లో కూడా ఇవే ఫలితాలు నమోదైనట్లు తెలిపింది.

* 2-డీజీ ప్రయోజనాలు

2-డీజీ ఔషధం ఒక రకమైన గ్లూకోజ్ వంటిది. ఇలాంటి జెనరిక్ మాలిక్యూల్‌ను సలభంగా తయారు చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా వేగంగా వ్యాధిని నయం చేసే అవకాశం ఉంటుంది. పొడి రూపంలో ఉండే ఈ మందును సాచెట్‌లలో ప్యాకింగ్ చేస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగితే చాలు... ఆ తరువాత మందు పనిచేయడం ప్రారంభిస్తుంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad