Trending

6/trending/recent

Earthquake: చిత్తూరు జిల్లాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు.. ఎందుకు ఇలా జరుగుతుందంటే..?

భారీ వర్షాల భయం వీడినా భూప్రకంపనలు, భూమి నుంచి వస్తున్న భారీ శబ్దాలు చిత్తూరు జిల్లాను ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. భూమి పొరల నుంచి వినిపిస్తున్న వింత శబ్దాలు భయపెడుతూనే ఉన్నాయి...

భారీ వర్షాల భయం వీడినా భూప్రకంపనలు, భూమి నుంచి వస్తున్న భారీ శబ్దాలు చిత్తూరు జిల్లాను ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. భూమి పొరల నుంచి వినిపిస్తున్న వింత శబ్దాలు భయపెడుతూనే ఉన్నాయి. గత 20 రోజులుగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తరచూ పలకరిస్తున్న ఎర్త్ క్వెక్ వార్నింగ్ ఆందోళనకు గురిచేస్తోంది. భూమి పొరల్లో గలగల శబ్దాల కదలికలు, వింత శబ్దాలతో కంపిస్తున్న భూమి ఎప్పుడు ప్రకృతి వైపరీత్యంగా పలకరిస్తుందోనన్న భయం జిల్లాలోని పలు మండలాల్లో వెంటాడుతూనే ఉంది.

ప్రధానంగా చిత్తూరు జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాల తర్వాత వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయి. భూమి పొరల్లో వస్తున్న కదలికలు, శబ్దాలతో భూమి కంపించడం లాంటి సంఘటనలతో స్థానికులను ఆందోళన చెందుతున్నారు. రామకుప్పం, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు, సోమల, రామసముద్రం, పుంగనూరు మండలాల్లో తరచూ భూమి కంపిస్తుండటంతో అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 20 రోజులుగా రామకుప్పం, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు మండలాల్లోని పలు ప్రాంతాల్లో భూమి నుంచి వస్తున్న శబ్దాలు స్థానికులను మరింత ఆందోళన గురి చేస్తుంది. గత నెల 20 రోజులుగా ఐరాల మండలం అబ్బుగుండు గ్రామంలో తరచూ భూమి కంపిస్తూనే ఉంది.

గత నెల 11 నుంచి ఇప్పటిదాకా భూమి నుంచి వింత శబ్దాలు రావడం, భూమి కదలినట్లు గుర్తిస్తున్న స్థానికులు గ్రామంలో ఉండాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక గ్రామస్థుల్లో భయాన్ని పొగొట్టేందుకు అధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. భూమి పొరల మద్య రాపిడితో శబ్దాలు, కదలికలు వస్తున్న మాట వాస్తవమేనని నిర్ధారించి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలోనూ గత నెల 23 నుంచి వరుసగా భూమి కంపిస్తూనే ఉంది. ఇంటి గోడలు పగుళ్లు ఏర్పడటంతోపాటు భూమి నుంచి వస్తున్న భారీ శబ్దాలతో స్థానికుల గుండె ఆగిపోయేలా ఉన్నాయి. పుంగనూరు మండలం చిలకావారిపల్లి పంచాయితీలో ఈ మధ్య ప్రకంపనలు బెదరగొట్టాయి. సోమల మండలం ఇర్లపల్లె, చిన్న ఉప్పరపల్లె, ఆవులపల్లె గ్రామాలతోపాటు రామసముద్రం మండలం కాప్పల్లిలో భూమి కంపిస్తుంది.

భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరగడంతో పాటు భూమి ఒత్తిడికి గురై భూమి పొరల్లో కదలికలు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అర్ధరాత్రి వేళల్లో భూ ప్రకంపనలతో రావడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు పెడుతున్నారు. రామకుప్పం, బైరెడ్డిపల్లి మండలాల్లోని పలు గ్రామాలను భూ ప్రకంపనలు వెంటాడుతూనే ఉన్నాయి. రామకుప్పం మండలంలోని గడ్డూరు, యానాదికాలనీ, క్రిష్ణానగర్ కాలనీ, గోవిందరాజపురం, గొరివిమాకులపల్లి, ఎస్ గొల్లపల్లి, చిన్నగరిగెపల్లి, పంద్యాల మడుగు ప్రాంతాల్లో వరుసగా భూమి కంపిస్తూనే ఉంది.

బీటలు వారుతున్న ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శబ్దాలతో భూమి కంపిస్తే ఇళ్లల్లో ఉండొద్దని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు పొలాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. రామకుప్పం, గుడుపల్లి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు రాత్రి పూట పొల్లాల్లో ఉంటే ఎక్కడ ఎనుగులు దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. భూమి కంపించడం, భూమి పొరల్లో కదలికలు రావడం నిరంతరం జరిగే ప్రక్రియగానే చూస్తున్న జియాలజిస్టులు భూకంపం ప్రభావం రాయలసీమ ప్రాంతంలో ప్రమాద స్థాయిలో ఉండే అవకాశం లేదంటున్నారు. సేఫ్ జోన్లో ఉన్నామని నిశ్చింతగా ఉండాలంటున్న పరిశోధకులు భూమి పొరల్లోకి నీరు చేరడం ద్వారా గాలి బయటకు వచ్చే సమయంలో భూమిలో శబ్దాం వస్తుందని వివరించారు. అలాంటి కదలికల ద్వారానే భూమి కంపించడం సహజమేనని ఎస్వీ యూనివర్సిటీలోని జియాలజీ విభాగం ప్రొఫెసర్లు చెబుతున్నారు.

Earthquake: చిత్తూరు జిల్లాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు.. ఎందుకు ఇలా జరుగుతుందంటే..?


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad