Trending

6/trending/recent

NEP: నూతన విద్యా విధానం అమలయ్యేనా..ఆలస్యమేనా?

  • నూతన విద్యా విధానంపై గందరగోళం
  • పెరగనున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు

నూతన విద్యావిధానం-2020 అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ నేటి నుంచి అమల్లోకి తేవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 250 మీటర్ల పరిధిలోని 195 ప్రాథమిక పాఠశాలలు 180 ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనం కానున్నాయి. అయితే 250 మీటర్లలోపు పూర్వ ప్రాథమిక విద్య (అంగన్‌వాడీ కేంద్రాలు) పీపీ-1, పీపీ-2 మరియు 1, 2 తరగతుల విలీనంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవటంతో ఫౌండేషన్‌ పాఠశాలలపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. అంతేకాక 3, 4, 5 తరగతుల విలీనంపై మౌలిక వసతులు, ఉపాధ్యాయుల సర్దుబాటు వంటివి జిల్లాలో పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. మండలాలకు తుది ఉత్తర్వులు రాకపోవటం, అంగన్‌వాడీ కేంద్రాల విలీనంపై స్పష్టత లేకపోవటంతో నూతన విద్యావిధానం అమలుపై గందరగోళం నెలకొంది.

ఆదేశాల కోసం ఎదురుచూపులు

ప్రభుత్వం రూపొందించిన ఫౌండేషన్‌ పాఠశాలల ఏర్పాటు షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 1 నుంచి అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌ పూర్తయింది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో అర్హత గల సీనియర్‌ ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. జూనియర్‌ ఉపాధ్యాయులను 1:30 నిష్పత్తిలో ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులకు కేటాయించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం పదోన్నతుల కౌన్సెలింగ్‌ ముగిసి, ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై అధికారులు, సిబ్బంది తీరిక లేకుండా ఉన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో నూతన విద్యా విధానం అమలుకు మరికొంత సమయం పట్టవచ్చనే ఊహాగానాలే ఉన్నాయి.

బోధనపై ప్రభావమిలా!

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, పాఠశాలల విలీనంతో మరో 50 పాఠశాలలు అలా మారనున్నాయి. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలని, విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టంగా సూచిస్తున్నా అమలులో ఎక్కడా సాధ్యం కావట్లేదు. అంతేకాక నూతన విద్యావిధానంలో మరిన్ని పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారడంతో విద్యాబోధన సంక్లిష్టం అవుతుందని, అసలే యాప్‌లలో సమాచారం నమోదుతో సమయం హరించుకుపోతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

డిప్యుటేషన్‌ పద్ధతిలోనా?

3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే సమయంలో సీనియర్‌ ఎస్జీటీలను డిప్యుటేషన్‌ పద్థతిలో సర్దుబాటు చేస్తారా లేక పూర్తిస్థాయిలో వారి సర్వీసులను బదిలీ చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఎన్‌సీఈఆర్టీ నిబంధనల ప్రకారం ఎస్జీటీలు 8వ తరగతి వరకు బోధించవచ్ఛు ప్రస్తుతం డిప్యుటేషన్‌ విధానంలో భర్తీ చేసి బదిలీల సమయంలో వారికి పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని సంఘాలు కోరుతున్నాయి. ఏదేమైనా నూతన విధానంపై అమలులో సైతం స్పష్టత లేకపోవటంతో ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.

ఇబ్బంది కలగకుండా చర్యలు

ఇప్పటికే విలీనం అయ్యే పాఠశాలల మ్యాపింగ్‌ పూర్తయింది. విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాగానే కొత్త విద్యా విధానం అమలుకు అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. -

కె.నరేశ్‌కుమార్‌, ఎంఈవో

నిష్పత్తిని మార్చాలి

హేతుబద్ధీకరణ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1: 20 నిష్పత్తిలో పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను కేటాయించాలి. విద్యార్థులున్న చోట విద్యా వాలంటీర్లను నియమించాలి. ప్రస్తుతం ఉన్న విధానంలో ప్రతి పాఠశాలలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని కోరుతున్నాం. 

- బి.రాజేంద్రప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad