Trending

6/trending/recent

MDM in Aided Schools Issue: ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం

  • వంట కార్మికులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు ఆదేశాలు

న్యూస్ టోన్, అమరావతి: ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోనుంది. పేద విద్యార్థులకు ఇంతకాలం ఉచితంగా అందుతున్న పోషకాహారం ఇక లభించదు. ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు గ్రాంటు నిలిపివేయడంతో చాలావరకు ఎయిడెడ్‌ బడులు ప్రైవేటు పాఠశాలలుగా మారిపోయాయి. వీటిలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సమీపంలోని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా విద్యాధికారి ఇప్పటికే ఆదేశాలు విడుదల చేశారు. వంట కార్మికులను ఎవ్వరినీ  తొలగించకుండా నిబంధనల ప్రకారం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించాలని పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులకు ఒకరు, వంద మందికి ఇద్దరు, ఆపైన ప్రతి వంద మందికి ఒకరి చొప్పున ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సర్దుబాటు చేయాలని సూచించారు.

ఆ పాఠశాలల్లో కొనసాగిస్తారా?

రాష్ట్రంలో 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కిచ్చేందుకు 1,214 విద్యాసంస్థలు సమ్మతి తెలిపాయి. సమ్మతి తెలిపిన విద్యాలయాలను ప్రైవేటుగా నిర్వహించుకోవాలంటూ జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో మొత్తం 1.97 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు వీరిలో కొంతమందిని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసినా మిగతావారు అక్కడే కొనసాగే అవకాశం ఉంది. ప్రైవేటుగా మారిన ఎయిడెడ్‌ బడిలో చదివేవారికి ఇక మధ్యాహ్న భోజనం ఉండదు. ఇప్పటికే సమ్మతి తెలిపిన కొన్ని యాజమాన్యాలు అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖకు లేఖలు రాశాయి. రాష్ట్రంలో 400 ఎయిడెడ్‌ పాఠశాలలను నిర్వహిస్తున్న ఆర్‌సీఎం యాజమాన్యాలు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఈ లేఖలు పంపాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందా? లేదా అనేదానిపైనా స్పష్టత లేదు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad