Trending

6/trending/recent

No PRC No DA: పీఆర్సీ లేదు.. డీఏలు రావు

  • నెలనెలా జీతం కోసమూ ఎదురుచూపులే
  • మూడేళ్లు దాటిన పీఆర్సీ ప్రక్రియ
  • చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘ నిరీక్షణ
  • నివేదిక చేతిలోనే ఉన్నా ప్రభుత్వ నిర్లిప్తత
  • పీఆర్సీ జాప్యంతో 5,600 కోట్ల బకాయి
  • డీఏ బకాయిలు రూ.12,492 కోట్లు
  • ఇతర బకాయిలు రూ.3,000 కోట్లు
  • నేడు కౌన్సిల్‌ మొదటి సమావేశం
  • ఉద్యోగులకు ‘ఆర్థిక’ కష్టాలు.. నేటి స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఏం సాధిస్తారో!?

‘పీఆర్సీ  ఒక ఏడాది ఆలస్యమవడం సహజం. ఇప్పుడు మూడేళ్లా  నాలుగు నెలల నుంచీ పెండింగ్‌లోనే ఉంది. డీఏలు అందడంలేదు. 15వ తేదీ దాకా పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేసి... పాత పెన్షన్‌ అమలు చేస్తామన్నారు. అయినా పట్టించుకోలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది!’’

 - ఉద్యోగుల అసంతృప్తి

ఐదేళ్లకోసారి దక్కాల్సిన పీఆర్సీ... గడువు ముగిసి మూడేళ్లు దాటినా కొలిక్కి రావడంలేదు. ఎప్పటికప్పుడు అందాల్సిన డీఏలు అందనంత దూరంలోనే ఆగిపోతున్నాయి. రిటైర్‌ అయిన ఉద్యోగులకు నెలల తరబడి ఆర్థిక ప్రయోజనాలు అందడంలేదు.  చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలు అనుకునే పరిస్థితి! అంతా గందరగోళం! అస్తవ్యస్తం! ఇలాంటి పరిస్థితుల మధ్య శుక్రవారం కీలకమైన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం తేల్చుతారోనని ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఉద్యోగులకు ఐదేళ్లకొకసారి పీఆర్సీ ఇవ్వాలి. కానీ, ప్రస్తుత ఐదేళ్ల కాలంలో ఇప్పటికే మూడేళ్ల నాలుగు నెలలు గడిచిపోయాయి. చంద్రబాబు హయాంలో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌  అధికారంలోకి వచ్చాక నివేదిక సిద్ధమైంది. అది సిద్ధమయ్యే రెండేళ్ల నాలుగు నెలలవుతోంది. ఆపై మరో ఏడాది గడిచిపోయినా.. ఇప్పటికీ సర్కార్‌ పీఆర్సీ ఊసెత్తడం లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పీఆర్సీ అడిగేందుకు ఇన్నాళ్లుగా వెనకడుగేశాయి. ఇప్పుడు సంఘాలన్నీ కలిసి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌గా ఏర్పడి ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. ఈ కౌన్సిల్‌ తొలిసమావేశం శుక్రవారం జరుగుతోంది. అంతకుముందు నుంచే ఈ నెలాఖరుకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించబోతోందంటూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తే ఎంత ఇస్తుంది? ఎంత శాతానికి ఎంత ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది? ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తమకింత శాతం పీఆర్సీ కావాలని ఏమైనా డిమాం డ్‌ చేస్తున్నారా? ఎంతిస్తే అంత తీసుకుందామనే ధోరణిలో ఉన్నారా?.. ఇలా అన్నీ ప్రశ్నలే...

సవరణపై స్పష్టత ఏదీ?

ప్రస్తుతం ఉద్యోగులకు 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నారు. తెలంగాణ తరహాలో ఆ 27 శాతం ఐఆర్‌కి ఇంకో 3 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి 30 శాతం పీఆర్సీ అ మలు చేసే అవకాశాలున్నాయని మెజారిటీ ఉద్యోగులు చెప్తున్నారు. అయితే, పీఆర్సీ అమల్లోకి రాగానే తక్షణమే హెచ్‌ఆర్‌ఏ శాతాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం 30 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిఽధిలో ఉండే ఉద్యోగి హెచ్‌ఆర్‌ఏ శాతంలో 24 శాతానికి పడిపోతాడు. 20, 15 శాతం హెచ్‌ఆర్‌ఏలు తీసుకుంటున్న ఉద్యోగులకు కూడా హెచ్‌ఆర్‌ఏ శాతాలు తగ్గుతాయి.  ఓవైపు ఫిట్‌మెంట్‌ రూపంలో వేతనం పెరిగినా .. ఆ పెరిగిన వేతనంలో మెజారిటీ భాగాన్ని హెచ్‌ఆర్‌ఏ తగ్గడం వల్ల కోల్పోతున్నాడు. అంటే 30 శాతం పీఆర్సీ వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండబోదని ఉద్యోగులు చెప్తున్నారు. కనీసం 33 శాతం పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, ఉద్యోగ సంఘాల నాయకులెవరూ ప్రభుత్వాన్ని ఇంతవరకూ తమకింత శాతం పీఆర్సీ కావాలని బహిరంగంగా ఎక్కడా అడిగినట్టు కనపడడం లేదు. 

ఇప్పుడు అమల్లో ఉన్న 27 శాతం ఐఆర్‌కి అనుగుణంగా 3 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి 30 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.100 కోట్లు. ఇందులో కూడా తగ్గిన హెచ్‌ఆర్‌ఏల వల్ల ప్రభుత్వానికి కొంత మిగులుతుంది. ప్రస్తుతం అమలవుతున్న ఐఆర్‌పై పెరిగే ప్రతి ఒక శాతం ఫిట్‌మెంట్‌కి అదనంగా ప్రభుత్వానికి రూ.33 కోట్లు ఖర్చవుతుంది. అలా 3 శాతం ఫిట్‌మెంట్‌కి లెక్కిస్తే అది రూ.100 కోట్లవుతుంది. అదే ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఖర్చవుతుంది. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తారా? తెలంగాణ తరహాలో 30 శాతం అడుగుతారా? ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం డిమాండ్‌ చేస్తారా? అనేది వేచి చూడాలి. 

ఏడాదిన్నర డీఏ నష్టం..

డీఏల రూపంలో ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం  రూ.12,492 కోట్లు బకాయి పడింది. 2018 జూలై 1నాటి డీఏను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి వేతనంతో కలిపి ఇస్తున్నారు. 2018 జూలై నుంచి 2020 డిసెంబరు వరకు ఉన్న 30 నెలలకు సంబంధించిన డీఏ బకాయి రూ.3,000 కోట్లుగా తేలింది. అలాగే, 2019 జనవరి 1నాటి డీఏను 2021 జూలై 1 నుంచి వేతనంతో కలిపి ఇస్తున్నారు. 2019 జనవరి నుంచి 2021 జూలై మధ్య ఉన్న 30 నెలలకు సంబంధించి డీఏ బకాయి మరో రూ.3,000 కోట్లుగా తేలింది. 2019 జూలై ఒ కటో తేదీ నుంచి ఇవ్వాల్సిన డీఏ 2021 అక్టోబరు నెలతో కలుపుకొని 28 నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్టు. దీని విలువ రూ.4638 కోట్లు. ఇక్కడివరకు డీఏ బకాయిలు రూ.10,638 కోట్లకు చేరుకున్నాయి. 2020 జనవరి ఒకటో తేదీన, 2020 జూలై ఒకటో తేదీన, 2021 జనవరి ఒకటో తేదీన ఇవ్వాల్సిన 3 డీఏలకు కలిపి కేంద్రం ఒకేసారి 11 శాతం డీఏను ప్రకటించింది. వీటిని 2021 జూలై ఒకటో తేదీ నుంచి వేతనంతో కలిపి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే ఏడాదిన్నరపాటు ఉద్యోగులు డీఏ కోల్పోయారు. దీన్ని రాష్ట్రానికి అన్వయించుకుంటే 2021 జూలై నుంచి అక్టోబరు వరకు ఉన్న 4 నెలల కాలానికి సంబంధించి ఉద్యోగులకు రావాల్సిన డీఏల విలువ రూ.1457 కోట్లు. 2021 జూలై ఒకటో తేదీ నుంచి ఇంకో డీఏ రావాలి. జూలై - అక్టోబరు నెలలకు డీఏల పెండింగ్‌ విలువ రూ.397 కోట్లు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం బాకీపడిన డీఏలు రూ.12,492 కోట్లుగా లెక్కకొచ్చింది.

మూడు శాతమా? ఆరు శాతమా?

ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం పీఆర్సీ రూపంలో కూడా బకాయి పడింది. 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో కొంత ఫిట్‌మెంట్‌ ఇచ్చి పీఆర్సీ ప్రకటిస్తే 2019 జూలై ఒకటో తేదీ నుంచి ఆ పీఆర్సీని అ మలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం మూడు శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే బకాయిలు రూ.2,800 కోట్లుగా, ఉద్యోగులు కోరుకుంటున్నట్టు ఆరు శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే బకాయిలు రూ.5,600 కోట్లకు చేరుకుంటాయి. ఇవికాకుండా తమకు వివిధ రూపాల్లో ఇంకో రూ.3,000 కోట్ల వరకు బాకీ ఉండొచ్చని ఉద్యోగులు చెప్తున్నారు. ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌, గ్రాట్యుటీల రూపంలో ప్రభుత్వం నుంచి ఇంకా రూ.3,000 కోట్లు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు.



Tags

Post a Comment

1 Comments
  1. ఒక ఆయన అమరావతి కి పెట్టుబడి అన్నాడు , అమ్మో అనుకున్నాం. ఈయనగారు అన్నీ నేనే ఇచ్చేస్తా అని నాకిస్తున్నాడు. చివరికి మాకు సగం జీతమైనా ఇప్పించండి అని వేడుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగం అంటే పారిపోయే రోజులు చూడబోతున్నాం.

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad