Trending

6/trending/recent

PRC Demand: 11వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి

  •  ఏపీ ఐకాస అమరావతి డిమాండ్‌

PRC Demand: ఉద్యోగులు చిరకాలం గుర్తుంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు డిమాండు చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎం జగన్‌ వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం ప్రకటిస్తారనే విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. కొత్త పీఆర్‌సీ కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోందని, ఉద్యోగుల హక్కులను సాధించడంలో ఏపీ ఐకాస అమరావతి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

పీఆర్‌సీ ఇవ్వకుంటే జీతాలు పెరిగేది ఎలా?: ఎమ్మెల్సీ అశోక్‌బాబు

వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) ఒప్పందాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను ప్రభుత్వం మోసగించిందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు.

 ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘2020 అక్టోబరులోనే పీఆర్‌సీ నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేయలేదు. గత ఏప్రిల్‌లో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా పీఆర్‌సీ, సీపీఎస్‌ విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పింది. రాష్ట్రంలో 27% మధ్యంతర భృతి ఇచ్చారని, తెలంగాణలో ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది లేదని ఆర్థికశాఖ ప్రభుత్వానికి సమాచారం ఇస్తోంది. పీఆర్‌సీ ఇస్తేనే పింఛనులో లబ్ధి వస్తుంది. ఐఆర్‌ ఇచ్చినా ప్రయోజనం లేదు. తెలంగాణలో 30% పీఈఆర్‌సీని ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం గత జనవరిలో జారీ చేసిన జీవో ప్రకారం ఒక డీఏ ఇవ్వటానికి అంగీకరించింది. దీని ప్రకారం 2018 జులై నెల నుంచి డీఏ పెంపు మొత్తం జీతం, పింఛనులో కలవాలి. ఇప్పటివరకు ఇవ్వలేదు. మొత్తం మూడు డీఏలను ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చింది. దీనిపై ఉద్యోగుల్లో ఆవేదన ఉంది. ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 4.7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతోంది. 2.8 లక్షల మంది గ్రామవాలంటీర్లు ఉద్యోగులు కాదని సీఎం స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తించాలి’ అని పేర్కొన్నారు.

పీఆర్సీ, డీఏ చెల్లింపు తేదీలను ప్రకటించాలి: ఎమ్మెల్సీ నరసింహారెడ్డి

పీఆర్సీ, డీఏ చెల్లింపుల తేదీలను ప్రకటించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకాలకు ముందస్తు తేదీలను ప్రకటించి, అమలు చేసినట్లే 8లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ చెల్లింపు తేదీలను ప్రకటించాలన్నారు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఇచ్చిన డీఏ ఉత్తర్వులు మూడు నెలలైనా అమలుకు నోచుకోలేదని వెల్లడించారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad