Trending

6/trending/recent

MLC on New Education Policy: తరగతుల తరలింపు తగదు

3, 4, 5 తరగతులు 3-5 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడం వలన కొత్త సమస్యలు వస్తాయి.3, 4, 5 తరగతుల పిల్లలు 3-5 కి.మీ పాఠశాలలకు వెళ్ళి రావడం దూరం భారంగా తయారవుతుంది. రవాణా సదుపాయం గురించి ప్రస్తావన లేదు. డేస్కాలర్‌గా ఇంత దూరం వెళ్ళి రావడమే ప్రధాన సమస్య. ఇది విద్యార్థుల రెగ్యులారిటీని దెబ్బతీస్తుంది. డ్రాపవుట్లను పెంచుతుంది.

కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో సంస్కరణలకు తెరలేపింది. మోడీ ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రజా వ్యతిరేక చట్టాల విషయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి సానుకూలంగానే వ్యవహరిస్తున్నది. వ్యతిరేకించిన విషయాలు గాని, ఘర్షణపడిన సందర్భాలు గాని దాదాపుగా లేవు. గతంలో సిపియస్‌ రద్దు, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేసిన కార్మిక చట్టాల రద్దు, వ్యవసాయ బిల్లులు, 370 ఆర్టికల్‌ రద్దు, ఎల్‌.ఐ.సి పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌...వగైరా బిల్లులన్నింటికి వైసిపి మద్దతు తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏ విధమైన చర్చ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర విద్యా విధానంలో ఏ విషయం పట్ల మాట్లాడేదే లేదు. మేం కోరుకొన్నది ఇదే అన్నట్లుగా చాలా వేగంగా ఈ విద్యా విధానం అమలుకు చర్యలు చేపట్టింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రప్రభుత్వం సర్క్యులర్‌ (నెం:172 తేది 31.05.21) విడుదల చేసింది.

ప్రస్తుతం అమలులో ఉన్న పాఠశాల 10+2 విద్య నిర్మాణం 5+3+3+4గా మార్పును ప్రతి పాదించారు. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల వ్యవస్థను 3 అంచెలుగా మార్పు చేస్తున్నారు. పిల్లల నివాసానికి దగ్గరలో వై.ఎస్‌.ఆర్‌ ప్రాథమిక పాఠశాల, ఒక కిలోమీటరు పరిధిలో ఫౌండేషన్‌ స్కూలు, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల వుంటాయని చెబుతున్నారు. వై.ఎస్‌.ఆర్‌. ప్రాథమిక పాఠశాలలో ప్రీప్రైమరీ1, ప్రీప్రైమరీ 2 తరగతులు (వయస్సు పేర్కొన లేదు) ఫౌండేషన్‌ స్కూల్‌లో ప్రిపరేటరీ ఫస్టు క్లాసు, ఒకటి, రెండు తరగతుల వరకే ఉంటాయి. ఈ విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్‌ఆర్‌ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందుతాయి. 3, 4, 5 తరగతులు 3-5 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలించడం వలన అక్కడ 150 మంది విద్యార్థులకు మించి పిల్లల సంఖ్య పెరిగితే దాన్ని ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియం విద్యార్థుల సంఖ్యను బట్టి తెలుగు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళుగా కొనసాగిస్తారు. విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు బాగున్నచోట మండలానికి ఒకటి, రెండు పాఠశాలలకు ఇంటరు తరగతులు ఎటాచ్‌ చేస్తారు. వైఎస్‌ఆర్‌ ప్రాథమిక పాఠశాల, ఫౌండేషన్‌ స్కూలు, ఉన్నత పాఠశాలలను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అమలులో ఏ ప్రాథమిక పాఠశాల మూత పడేది లేదని చెబుతున్నారు. ఫౌండేషన్‌ స్కూల్‌లో 1:30 నిష్పత్తిలో ఒక సెకండరీ గ్రేడ్‌ టీచరు ఉంటారు. ఈ ఫౌండేషన్‌ స్కూల్‌లో ప్రీప్రైమరీ తరగతి బోధనకు వేరుగా మానవ వనరుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అయితే స్పష్టత లేదు.

పూర్వ ప్రాథమిక విద్య

ఇంతవరకు అంగన్‌వాడీల నిర్వహణలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం మాత్రమే అందించడం జరుగుతుంది. ఈ పిల్లలకు అకడమిక్‌ సిలబస్‌, బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు లేరు. ప్రస్తుతం దీన్ని పి.పి.1, పి.పి.2గా చేసే మార్పు పట్ల దాదాపు ఏకాభిప్రాయం ఉంది. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు దీన్ని స్వాగతిస్తున్నాయి. అయితే ఫౌండేషన్‌ స్కూల్‌లో ప్రిపరేటరీ 1 చేర్చారు. దీన్నికూడా ప్రీప్రైమరీ తరగతులను చేర్చితే బాగుండేది. ఈ నేపథ్యంలో 47 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఏమవుతాయో స్పష్టత లేదు. వీటిని శిశుసంక్షేమ శాఖ నిర్వహిస్తుందా? లేకుంటే విద్యాశాఖ నిర్వహిస్తుందా? అనేది స్పష్టం చేయాలి.

ఫౌండేషన్‌ స్కూల్‌

ప్రిపరేటరీ 1, ఒకటి, రెండు తరగతులతో ఒక సెకండరీ ఉపాధ్యాయునితో నిర్వహించడం వలన ముప్పై మంది విద్యార్థుల వరకు ఏ నాణ్యమైన విద్య అందించగలదో ప్రభుత్వం చెప్పాలి. పాఠశాల విద్యలో ఒకటి రెండు తరగతులు కీలకమైనవి. ఒక్క ఉపాధ్యాయునితో 3 తరగతుల నిర్వహణ సాధ్యం కాదు. ఈ ఫౌండేషన్‌ పాఠశాల వ్యవస్థతో విద్యార్థులకు, విద్యాభివృద్ధికి, ప్రాథమిక పాఠశాల వ్యవస్థకు నష్టం జరుగుతుంది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి తరలిపోయే ప్రమాదం ఉంది. నమోదులు తగ్గే అవకాశం ఉంది. ఈ ఫౌండేషన్‌ విద్యాశాఖ పరిధిలో ఉంటుందా? లేక సొసైటీగా నిలిపివేస్తారా స్పష్టత లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య సరిగాలేదనే, ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయనే సుమారు 40 శాతం పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు మళ్ళారు.

3, 4, 5 తరగతుల తరలింపు తగదు

3, 4, 5 తరగతులు 3-5 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడం వలన కొత్త సమస్యలు వస్తాయి. విద్యాహక్కు చట్టం, అన్ని విద్యా కమిషన్లు ప్రాథమిక పాఠశాల ఒక కి.మీ. పరిధిలో, యు.పి స్కూలు 3 కి.మీ. పరిధిలో, ఉన్నత పాఠశాల 5 కి.మీ పరిధిలో ఉండాలనే నిబంధనకు ఈ కొత్త విధానం తిలోదకాలు ఇచ్చింది. 3, 4, 5 తరగతుల పిల్లలు 3-5 కి.మీ పాఠశాలలకు వెళ్ళి రావడం దూరం అవుతుంది. రవాణా సదుపాయం గురించి ప్రస్తావన లేదు. డేస్కాలర్‌గా ఇంత దూరం వెళ్ళి రావడమే ప్రధాన సమస్య. ఇది విద్యార్థుల రెగ్యులారిటీని దెబ్బతీస్తుంది. డ్రాపవుట్లను పెంచుతుంది. షెడ్యూల్‌ ఏరియాలో 3వ తరగతి నుండి ఆశ్రమ పాఠశాలలకు తరలించడం వలన ఇవే సమస్యలు వచ్చాయి. అయితే అక్కడ రెసిడెన్షియల్‌ వ్యవస్థ కాబట్టి విద్యార్థి రోజూ తిరిగి ఇంటికి రానవసరం లేదు.

డిఎస్‌సి ఉంటుందా ?

34 వేల ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్‌ స్కూళ్లుగా మార్చి...ఈ పాఠశాలల్లో ఒక్క సెకండరీ గ్రేడ్‌ టీచర్‌నే ఉంచి మిగిలిన ఉపాధ్యాయులకు 3, 4, 5 తరగతులతో బాటు తరలించడం వలన ఉపాధ్యాయ పోస్టులను తగ్గించుకోవచ్చనే లోగుట్టు దాగిఉంది. లేదా ఉన్న ఉపాధ్యాయులతోనే సరి పెట్టుకోవచ్చుననే ఆలోచన ప్రభుత్వానికి ఉండవచ్చు. ఎందుకంటే మొత్తం విద్యార్థులు, ఉన్న ఉపాధ్యాయులను లెక్కేసి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మెరుగ్గా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఆ విధంగా 20 ఏళ్ల కాలంలో వేలకొలది ఎస్‌.జి.టి పోస్టులు ప్రభుత్వం రద్దు చేస్తూ వచ్చింది. తరగతులు, స్కూళ్ళు విలీనం వలన పోస్టుల సంఖ్య కచ్చితంగా తగ్గుతుంది. ఈ స్కూళ్ళ మేపింగ్‌తో ఈ సంవత్సరం గడిచిపోతోంది. ఈ లెక్కలు తేలిన తర్వాతనే డి.ఎస్‌.సి వేస్తామని ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.

సి.బి.యస్‌.ఇ సిలబస్‌

ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు విషయం కోర్టులో ఇంకా తేలలేదు. ఈలోగా 9, 10 తరగతుల్లో సిబియస్‌ఇ సిలబస్‌ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతుంది. ఉన్నత పాఠశాలల్లో తెెలుగు మీడియం రద్దుతో రెండు మీడియంలకు వేర్వేరుగా ఉన్న ఉపాధ్యాయులను రేషనలైజ్‌ చేయడం ద్వారా పోస్టులు తగ్గించడం జరుగుతుంది. సిబియస్‌ఇ సిలబస్‌ ప్రవేశ పెట్టడం ద్వారా తెలుగు మీడియం అనే ప్రశ్న లేకుండా చేయవచ్చనే ఆలోచన ప్రభుత్వానికి వున్నట్లుంది. గతంలో కూడా సిబిఎస్‌ఇ సిలబస్‌, స్టేట్‌ సిలబస్‌ ఏది మెరుగ్గా ఉందనే చర్చ జరిగినప్పుడు స్టేట్‌ సిలబస్‌ నాణ్యతగా ఉందనే అభిప్రాయాలు వచ్చాయి. అయినా దీనిపై నిపుణుల కమిటీగాని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

చర్చ జరగాలి

పాఠశాల విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేయదలచిన మార్పుపై విస్తృత చర్చ జరపాలి. అభిప్రాయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించడం సరిగాదు. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయకుండా స్ట్రక్చరల్‌ మార్పుతో ఒరిగేదేమీ ఉండదు. ప్రభుత్వం అన్నింటా ఏదో మార్పు చేస్తుందనే భ్రమలు కల్పించడం, తద్వారా రాజకీయ ప్రయోజనం కోసం ఆరాటం కనిపిస్తుంది. పూర్వ ప్రాథమిక విద్యను, అలాగే ఉన్నత పాఠశాలల్లో ఇంటరు తరగతుల విలీనాన్ని దాదాపుగా విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం ద్వారా ఒరిగేదేమీ లేదు. విద్యార్థికి దూరం పెరుగుతుంది. గ్రామానికి ఒక్క బడి అయినా న్యాణ్యమైన విద్యను అందించాలి. అదే సందర్భంలో ఇంటరు విద్య ఏమిటనే చర్చ జరుగుతుంది. ఈ మొత్తం మార్పులతో ఉపాధ్యాయ, అధ్యాపకులకు ఎదురయ్యే సమస్యలు చర్చించాల్సి ఉంది. ఇవేమీ లేకుండా 'మీరేదయినా చెప్పండి. మేం చేసేది చేసుకుపోతాం' అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు.

- వ్యాసకర్త పిడియఫ్‌ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad