Trending

6/trending/recent

Corona Vaccine: ఆమోదం పొందని 30 కోట్ల టీకా డోసులకు ఆర్డర్ పెట్టిన కేంద్రం

Corona Vaccine:  భారతదేశంలో ఏర్పడిన రెండవ వేవ్ కోవిడ్ సంక్షోభం నడుమ కేంద్రం 30 కోట్ల కరోనావైరస్ వ్యాక్సీన్ డోసులను ఆర్డర్ చేసింది.

భారతదేశంలోని బయోలాజికల్-ఈ అనే సంస్థ ఇంకా పేరు పెట్టని తన వ్యాక్సీన్‌కు మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది. మొదటి రెండు దశల ప్రయోగాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, 3వ దశ ట్రయల్స్‌లో ఉన్న ఈ వ్యాక్సీన్ వాడేందుకు అత్యవసర ఆమోదం లభించలేదు. ఈ వ్యాక్సీన్ కోసం కేంద్ర ప్రభుత్వం 20.6 కోట్ల డాలర్ల (దాదాపు 1500 కోట్ల రూపాయలు) విలువైన ఆర్డర్ పై సంతకం చేసింది.

దేశంలో మందకొడిగా సాగుతున్న వ్యాక్సీన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య చేపట్టారు.

భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటి వరకు 20.2 కోట్లు వ్యాక్సీన్ డోసులను మాత్రమే ఇచ్చారు. దేశ జనాభాలో 10 శాతం కంటే తక్కువ మందికి ఒక డోసు వ్యాక్సీన్ లభించింది. దేశంలో వ్యాక్సీన్ కొరత కొనసాగడమే దీనికి ప్రధాన కారణం.

దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, భారతదేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటివరకు దేశంలో 3,40,000 మరణాలు నమోదయ్యాయి. కానీ, ఈ సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యాక్సీన్ల కోసం స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ, ఉత్పత్తిదారుల నుంచి ముందుగానే భారీ స్థాయిలో ఆర్డర్లు పెట్టకపోవడం పట్ల భారత ప్రధాని మోదీ విమర్శలు ఎదుర్కొన్నారు.

భారతదేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయో టెక్-ఐసీఎంఆర్ కలిసి ఉత్పత్తి చేస్తున్న కోవ్యాక్సీన్, మాస్కోలోని గమాలేయా ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న స్పుత్నిక్-వి వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి.

జనవరి నుంచి మే నెలల మధ్యలో మొత్తం 35 కోట్ల కోవిషీల్డ్, కోవ్యాక్సీన్ డోసులను కేంద్రం కొనుగోలు చేసింది.

జనవరిలో ట్రయల్స్ పూర్తికాక ముందే భారతదేశంలో ఔషధ నియంత్రణ సంస్థ కోవ్యాక్సీన్ వాడకానికి అత్యవసర ఆమోదాన్ని ఇచ్చింది.

ఈ వ్యాక్సీన్ సమర్ధత పై సమాచారం విడుదల కావల్సి ఉంది.

బయోలాజికల్-ఈ వ్యాక్సీన్ మరి కొన్ని నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

కోవిడ్ కేసులు తగ్గుతున్న దశలో మూడవ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్లను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. మూడవ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో ఈ ఏడాది జనవరిలో కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సీన్ల పట్ల ఉన్న సంశయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగలేదు. కానీ, రెండవ వేవ్ లో కేసులు విపరీతంగా పెరిగాయి. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, దహనవాటికల్లో స్థలం కొరత కూడా రెండవ వేవ్‌లో కనిపించింది.

ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 18 ఏళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సీన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కానీ, అందుకు తగినట్లుగా వ్యాక్సీన్ తయారీ సంస్థలు వ్యాక్సీన్ డోసులను సరఫరా చేస్తామని హామీ ఇవ్వలేదు.

వ్యాక్సీన్ కొరత కొనసాగడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు,పేదవారు వ్యాక్సీన్ తీసుకునే విషయంలో తీవ్ర అసమానతలకు గురవడం కూడా కనిపిస్తోంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad