Trending

6/trending/recent

AP Inter Exams: ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కొంత సమయం కావాలన్న ఏపీ తరఫు లాయర్..

 AP Intermediate Exams: ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ మినహా 21 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేయలేదు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం న్యాయస్థానం.. ఏపీ తరఫు న్యాయవాది మధ్య బలమైన వాదనలు జరిగాయి. జులై నెలాఖరులోగా పరీక్షలు పూర్తవుతాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా.. అంతకంటే ముందే పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మెహఫూజ్ నజ్కీ తెలిపారు. తీవ్రంగా ఆలోచించి, అధ్యయనం చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఇదిలాఉంటే.. ప్రతీ గదిలో 15 నుంచి 18 మందినే ఉంచుతామని ఏపీ సర్కార్ చెబుతోందని, ఈ లెక్కన 28,000 నుంచి 34,634 గదులు అవసరం అవుతాయిన సుప్రీంకోర్టు అంచనా వేసింది. దీనిపై ఏమైనా కసరత్తు చేశారా? లేదా ఈ విధానంపై వెనక్కి తగ్గుతారా? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా విద్యా సంస్థలతో పాట కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా వినియోగిస్తామని, తమకు ఒక ఫార్ములా ఉందని నజ్కీ కోర్టుకు వివరించారు. అయితే, సర్కార్ చెబుతున్న వివరాలు అఫిడవిట్‌లో కావాలని సుప్రీంకోర్టు కోరింది.

ఇదే సమయంలో ప్రభుత్వ విధానాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి, ఆందోళనను వ్యక్తం చేసింది. విద్యార్థులను జీవితాలను ఎలా రిస్క్‌లో పెడతారు అని ప్రశ్నించింది. ‘‘మీ సమాధానం సంతృప్తికరంగా లేదు. కోవిడ్ ప్రోటోకాల్ ఏర్పాట్ల గురించి చెప్పండి. సెకండ్ వేవ్ భిన్నమైనది. మీ సమాధానం అంగీకరిస్తాం, కానీ ఈ విషయంలో స్పష్టత కావాలి. గదుల్లో తగినంత వెంటిలేషన్ లేకపోతే ఏం చేస్తారు? పరీక్షల నిర్వహణకు తగిన మౌలిక వసతులు, ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. 34,000 గదులకు తగినంతగా సిబ్బంది కూడా కావాలి. పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పేస్తే సరిపోదు. విద్యార్థులు, సిబ్బంది విషయంలో బాధ్యత తీసుకుంటారా?’’ అని సుప్రీం ధర్మాసనం ఏపీపై ప్రశ్నల వర్షం కురిపించింది.

‘‘ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు ఉందని చెబుతున్నారు. ఇక్కడెవరూ దేన్నీ రుజువు చేయడానికి లేరు. పరీక్షల నిర్వహణ సహా. అంతర్జాతీయ అనుభవాలను గమనించండి. సమూహమైన సందర్భాల్లోనే కోవిడ్ వ్యాప్తి జరిగింది. 360 డిగ్రీల్లో ఈ అంశాన్ని పరిశీలించండి. సమగ్రమైన ప్రణాళికతో మాముందుకు రండి. అప్పుడు పరీక్షలు నిర్వహించండి.’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

దీనికి రెస్పాండ్ అయిన ఏపీ తరఫు న్యాయవాది.. ఇంటర్నల్ మార్కులపై బోర్డులకు నియంత్రణ ఉండదని, ఆ మార్కులను గణించేందుకు ఏ ప్రత్యామ్నాయ విధానం సరికాదని పేర్కొన్నారు. అయితే, సగటు మార్కులు అనేది ఒక పద్ధగా పేర్కొన్న ధర్మాసనం.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, యూజీసీ నుంచి సూచనలు తీసుకోవాలంది. నిపుణులతో చర్చించి ఒక పరిష్కారం కనిపెట్టాలని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

‘‘ఒక్క మరణం కూడా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లతో మీరు ముందుకొచ్చేవరకు, వాటిపై మేం సంతృప్తి చెందేవరకు పరీక్షల నిర్వహణకు అంగీకరించబోం. మీరు చెబుతున్న ఏర్పాట్లపై మేం సంతృప్తి చెందడం లేదు. మీ నిర్ణయాలకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను మాకు చూపించండి. విద్యార్థులను డోలాయమానంలో ఉంచడం తగదు. మాకు సమగ్ర సమాచారం అందించండి.’’ అంటూ ఏపీ తరఫున లాయర్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

‘5,25,000 మంది విద్యార్థులు, వెంటిలేషన్ కల్గిన 34,634 గదులపై స్పష్టమైన ప్రణాళిక కావాలి. మీరు తగిన సమాచారం ఇవ్వకపోతే, పరీక్షలు రద్దు చేయాలని ఆదేశించాల్సి వస్తుంది. మహారాష్ట్ర, కేరళ సహా అన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. ఇప్పుడసలే డెల్టా ప్లస్ రకం కూడా ఉంది. మీకు కౌన్సిలింగ్ చేసేందుకు మేమిక్కడ లేం. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణపై మీకు బాధ్యత ఉంది. ఇది సంపూర్ణ అవగాహనతో తీసుకున్న నిర్ణయమైతే, ఎవరు తీసుకున్నారు? దీనిపై ఫైల్ ఏది?’ అంటూ ఏపీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు వేసిన వరుస ప్రశ్నలకు రెస్పాండ్ అయిన ఏపీ తరఫు న్యాయవాది నజ్కీ.. పరీక్షల విధుల్లో పాల్గొనేందుకు 50,000 మంది ఉద్యోగులను ఇప్పటికే గుర్తించామన్నారు. వారందరికీ వ్యాక్సిన్లు అందేలా చూస్తున్నామని చెప్పారు. సోమవారం వరకు తమకు సమయం ఇవ్వాలని, దీనికి సంబంధించిన గణాంకాలు, విద్యార్థులు, సిబ్బంది భద్రతపై పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతామంటూ సుప్రీంకోర్టుకు ఏపీ తరఫు న్యాయవాది నజ్కీ తెలిపారు. దీనికి రియాక్ట్ అయిన సుప్రీంకోర్టు.. ‘ఒక నిర్ణయం తీసుకోండి రేపు(శుక్రవారం) విచారణ జరుపుతాం’ అంటూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇదిలాఉండగా.. 10, 12(ఇంటర్ సెకండ్ ఇయర్) తరగతుల పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు సుప్రీంకోర్టుకు తెలిపింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టులో నిన్న అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. కేసుల సంఖ్య వేగంగా తగ్గతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఏపీ వెల్లడించింది. 10వ తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మార్కులు లెక్కించడం సరికాదంది. స్కూల్‌లో అంతర్గతంగా ఇచ్చిన మార్కులపై బోర్డులకు నియంత్రణ లేదని పేర్కొంది. దీని వల్ల ఖచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తామని, గదికి 15 నుండి 18 మంది మించకుండా చూస్తామని ఏపీ సర్కార్ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కోవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తామని అఫిడవిట్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad