Trending

6/trending/recent

Andhra Pradesh: బడిలో భయం భయం. కరోనా హాట్ స్పాట్ లుగా విద్యాసంస్థలు? సోమవారం కీలక నిర్ణయం!

ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. రోజు రోజుకూ స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడం కలవర పెడుతోంది. దీంతో వెంటనే కాలేజీలు, స్కూళ్లు మూసేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు భారీగా కేసులు నమోదవుతున్న విద్యాసంస్థలు సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

దేశ వ్యాప్తంగా పలు పరీక్షలు రద్దు అవుతున్నాయి. పలు రాష్ట్ర్రాల్లో విద్యార్థులను తరువాత క్లాసులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. కానీ ఏపీలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని.. అలాగే విద్యాలయాలను మూసివేయకుండా కట్టడిపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. కానీ పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో కేసులు సంఖ్య రెట్టింపు అవుతోంది.

చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు తాళాలు వేస్తున్నారు. పిల్లల చదువులకంటే ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చేశాయి. అందుకే పరీక్షా ఏదైనా.. క్లాసులు ఏవైనా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రధానంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే ఏపీలో మాత్రం బడి గంటలు మోగుతూనే ఉన్నాయి. పిల్లలు భయపడుతూనే బాడిబాట పడుతున్నారు.

ఎలక్షన్స్‌ వద్దే వద్దంటూ కోర్టుల చుట్టూ తిరిగిన ప్రభుత్వం.. విద్యాసంస్థలను ఎందుకు బంద్‌ చేయడం లేదని కొన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. విద్యార్థులు ఆరోగ్యం అంటే లెక్క లేదా అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల నిర్వహణపై క్లారిటీకి రాకపోవడానికి కారణం ఏంటి అని నిలదీస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు ఊహించని స్థాయిలో జెట్‌ స్పీడ్‌ దూసుకువస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏడు వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అమితే ముఖ్యంగా ఇందులో స్కూళ్లు, కాలేజీల నుంచి కరోనా బారిన పడినవారే ఎక్కువగా ఉండడం ఆందోళన పెంచుతోంది.

ముఖ్యంగా పాఠశాలల్లోనూ టీచర్లు, విద్యార్థులు అన్న తేడా లేకుండా అందర్ని కరోనా కాటేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తూ టీచర్లు, విద్యార్థుల జీవితాలతో ఆటాడుకోవడం మంచిది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లలను స్కూళ్లకు పంపాలి అంటేనే భయపడుతున్నారు. కానీ హాజరు శాతం తగ్గిస్తారని.. పరీక్షలు రాయకుండా చేస్తారనే భయంతో తప్పక పంపాల్సి వస్తోంది అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

దేశంలో మాత్రం కరోనా ఉధృతి కారణంగా కేంద్రం కూడా సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలకు తాళాలు పడ్డాయి. ఇటు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులను ప్రమోట్ చేశారు. సెంకడ్‌ ఇయర్‌ పరీక్షలను వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఇప్పటి వరకు నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే దాదాపు విద్యార్థులు భారీగా కరోనా బారిన పడినట్టు అధికారులు గుర్తించారు. అంతే కాదు పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద క్యాంపస్ ల్లో వందల సంఖ్యలో కేసులు నమోదైన పరిస్థితి కూడా చూశాం. ఇలాంటి సమయంలో స్కూళ్లను నడపడం కత్తిమీద సామే అంటున్నారు విద్యా సంస్థల యజమానులు. కానీ పిల్లల భవిష్యత్, భద్రత బాధ్యత తమేదే అంటూ ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరుగుతుందని జగన్ సర్కార్ అంటోంది. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే విద్యా సంస్థలు నడపడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో వీటి నిర్వహణపై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది.

Post a Comment

1 Comments
  1. పిల్లలు ప్రజల పిల్లలే కదా పాలకుల పిల్లలు కాదుకదా

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad