Trending

6/trending/recent

Get Rid Of Barrowings: అప్పుల ఊబిలో చిక్కుకున్నారా..ఇలా బయటపడండి!

Get Rid Of Barrowings: కరోనా సంక్షోభం కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసికంలో కుటుంబాల అప్పులు జీడీపీలో 37.1 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో పొదుపు రేటు 10.4 శాతానికి క్షీణించిందని ఇటీవల విడుదలైన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక స్పష్టం చేసింది. దీనికి తోడు ఇటీవల పుట్టుకొచ్చిన రుణ యాప్‌లు కొంతమందిని పూర్తిగా అప్పుల వలలోకి లాగేశాయి. మరి ఈ సమస్యతో మీరూ బాధపడుతున్నారా? అయితే, ఆ రుణ ఉచ్చు నుంచి బయటకు వచ్చేందుకు ఈ రెండు వ్యూహాల్లో ఏదో ఒకటి పాటించండి!

డెట్‌ అవలాంచె

రుణ ఉచ్చులో చిక్కుకున్న చాలా మందికి ఆర్థిక నిపుణులు సూచించే తొలి వ్యూహం డెట్‌ అవలాంచె. అధిక వడ్డీ ఉన్న అప్పులను వేగంగా వదిలించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. తొలుత వడ్డీరేట్ల ఆధారంగా మీ రుణాలను ఎక్కువ నుంచి తక్కువకు రాస్తూ ఓ జాబితాను సిద్ధం చేసుకోండి. ఎగవేత పరిధిలోకి రాకుండా బ్యాంకులు లేదా సంస్థలు నిర్దేశించిన కనీస మొత్తాన్ని అన్ని రుణాల్లోనూ చెల్లించండి. మిగిలిన అదనపు సొమ్మును అత్యధిక వడ్డీరేటు ఉన్న రుణాన్ని ముందుగానే చెల్లించేందుకు(ప్రీపేమెంట్‌) వినియోగించండి. అలా ఎక్కువ వడ్డీ ఉన్న రుణభారం తొలిగే వరకూ చేయండి. సాధారణంగా క్రెడిట్‌ కార్డుపై వడ్డీరేటు అధికంగా ఉంటుంది. తొలుత దీన్నుంచి బయటపడండి. తర్వాత వ్యక్తిగత రుణాలు, వినియోగ ఆధారిత వస్తువులపై తీసుకున్న రుణాలు.. ఇలా ఒకదాని తర్వాత ఒక దాన్ని జాబితా నుంచి తొలగించుకుంటూ వెళ్లండి. దీని వల్ల వడ్డీ వ్యయం తగ్గడంతో పాటు రుణాలు త్వరగా చెల్లించే అవకాశం ఏర్పడుతుంది.

డెట్‌ స్నోబాల్‌

ఈ పద్ధతిలో వడ్డీరేటుతో సంబంధం లేకుండా రుణమొత్తాన్ని తక్కువ నుంచి ఎక్కువకు జాబితా చేసుకోవాలి. అన్నింటికీ కనీస మొత్తం చెల్లించాలి. మిగిలిన సొమ్మును తక్కువ మొత్తం ఉన్న రుణానికి కేటాయించాలి. ఇలా ఒక్కొక్క రుణాన్ని జాబితా నుంచి క్రమంగా తొలగించుకుంటూ పోవాలి. నిజానికి ఈ పద్ధతి రుణ ఊబిలో చిక్కుకుపోయిన వ్యక్తుల మానసిక స్థితిని చాలా శాంతపరుస్తుంది. ఒక్కొక్కటిగా తొలగిపోతుంటే మనసు కుదుటపడుతుంది. చాలా మంది రుణాలు ఒక ఆర్థిక సమస్యగానే భావిస్తారు. కానీ, అప్పు అనేది ఒక మానసికపరమైన అంశం కూడా. అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి మానసికంగానూ కుంగిపోయే ప్రమాదం ఉంది. స్నో బాల్‌ పద్ధతి దీని నుంచి బయటపడేస్తుంది. వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అలవరిచి సరైన దారిలో పెడుతుంది. డెట్‌ అవలాంచెతో పోలిస్తే ఈ విధానంలో కొంత ఎక్కువ మొత్తమే ఖర్చు చేయాల్సి వస్తుంది. సమయం కూడా కాస్త ఎక్కువే తీసుకుంటుంది.

ఏది మంచిది?

రుణ ఉచ్చు నుంచి బయటపడాలన్న ఆలోచనే పెద్ద ముందడుగు. ఈ క్రమంలో ఏ మార్గం ఎంచుకోవాలన్నది కీలకమైన అంశం. ఇక డబ్బు ఆదా పరంగా చూస్తే కచ్చితంగా డెట్‌ అవలాంచె పద్ధతే ఉత్తమమైంది. కానీ, నిజంగా అప్పులు మిమ్మల్ని తీవ్రంగా కలచివేసి, మానసికంగా దెబ్బతీస్తున్నాయనుకుంటే స్నో బాల్‌ విధానానికే వెళ్లడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రుణాన్ని ఎగవేయాలన్న ఆలోచన రాకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

రుణాన్ని చెల్లించడమే కాదు.. మీ పెట్టుబడులపైనా ఓసారి లుక్కేయండి. మీరు చెల్లిస్తున్న వడ్డీకంటే తక్కువ రాబడి ఇచ్చే పథకాల నుంచి వైదొలగండి. ఆ సొమ్మును రుణం చెల్లించడానికి వినియోగించండి. అలాగే కుదిరితే రుణ సంస్థలతో చర్చించండి. మీ పరిస్థితిని వివరించి వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉందేమో అడగండి. లేదా తక్కువ వడ్డీరేటుకు టేకప్‌ చేసే సంస్థలకైనా బదిలీ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది.. కొత్త అప్పులు అస్సలు చేయకండి. ఇక ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంటే ఆర్థిక నిపుణుల్ని సంప్రదించి వారి సలహా తీసుకోండి.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad