Trending

6/trending/recent

పాఠశాలల కేటగిరీలపైగందరగోళం

  • పాయింట్లు రాలేదని అభ్యంతరాలు
  • కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
  • బదిలీలపై ఉపాధ్యాయుల ఆందోళన

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా రూపొందించిన హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీల సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఏవైౖనా అభ్యంతరాలు ఉంటే శనివారంలోగా తెలియజేయాలని డీఈవో వీఎస్‌ సుబ్బారావు కోరారు. అయితే దానిని పరిశీలించుకున్న ఉపాధ్యాయులు తాము పనిచేసే పాఠశాలకు తగినన్ని కేటగిరీ పాయింట్లు నమోదు కాలేదని, అవి తగ్గిపోతే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌ టోన్, ఒంగోలు నగరం: బదిలీలు కోరుకున్న ఉపాధ్యాయులకు సీనియారిటీ జాబితాలోనే వారి పాయింట్లు నమోదు చేస్తారు. వికలాంగులు, వితంతువులు, అవివాహితులు, క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటి సమస్యాత్మక వ్యాధులున్న వారికి ప్రాధాన్యత పాయింట్లు లభిస్తాయి. అలాగే పాఠశాల కేటగిరీ అక్కడ పని చేసిన సంవత్సరాలను బట్టి మరికొన్ని పాయింట్లు కలుపుతారు. పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. రోడ్డు, బస్సు సౌకర్యంలేని గ్రామాల్లోని పాఠశాలలను 4వ కేటగిరీగా పరిగణిస్తారు. ఆ రెండు సౌకర్యాలు ఉండి, పట్టణానికి దూరంగా ఉంటే 3గా, పట్టణం, నగరానికి సమీపంలో ఉంటే 2గా, పట్టణంలో ఉంటే ఒకటో కేటగిరీగా గుర్తిస్తారు. వాటిని బట్టి పాయింట్లు వేస్తారు. అవి ఎక్కువ వస్తే జాబితాలో ముందు వరుసలో ఉంటారు. అనుకూలమైన పాఠశాలను కోరుకునే అవకాశం లభిస్తుంది.

సమస్య ఇదీ...

జాబితా తయారీ తర్వాత ఉపాధ్యాయులు గుర్తించిన సమస్యను పరిష్కరించాలని ఎక్కువ మంది అభ్యంతరాలు తెలిపారు. గడువు ముగిసే సమయానికి మొత్తం 474 రాగా వాటిలో కేవలం పాఠశాల కేటగిరీపై 300 వచ్చాయి. ఉదాహరణకు కొనకనమిట్ల మండలంలో ఒక ఉపాధ్యాయుడు తాను పని చేసిన చోట 8 ఏళ్లు నిండడంతో బదిలీకి దరఖాస్తు చేశారు. ఆ గ్రామం 4వ కేటగిరీలో ఉండగా దానికి తగినట్లు పాయింట్లు నమోదు కాలేదు. దీనికి కారణం సకాలంలో సరైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడమే. పాఠశాల కేటగిరీలను పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ నిర్ణయిస్తారు. ప్రతి కౌన్సెలింగ్‌కు ముందు ఆ శాఖ నుంచి విద్యాశాఖ సమాచారం తెప్పించుకుంటుంది. బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయుడి వివరాలు మాత్రమే దానిలో నిక్షిప్తమవుతాయి. ఇప్పుడు అదే గ్రామంలో మరో పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీ కోరుకుంటూ దరఖాస్తు చేస్తే కేటగిరి వివరాలు అందుబాటులో లేక మూడో దాని కింద నమోదు చేస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణారెడ్డి మాట్లాడుతూ 2009లో కౌన్సెలింగ్‌ జరిగినప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం కేటగిరీ పాయింట్లు ఇవ్వాలన్నారు. ఆ జాబితా లేనందున ఇప్పుడైనా సేకరించి వాస్తవంగా నాలుగో కేటగిరీ పాఠశాలలో పని చేస్తున్న వారికి నష్టం లేకుండా చూడాలని కోరారు. డీఈవో వీఎస్‌ సుబ్బారావును వివరణ కోరగా జిల్లా కమిటీ ఆమోదించిన అన్ని పాఠశాలల కేటగిరీ జాబితా తమ వద్ద ఉందని, దానిని బట్టి పాయింట్లు కేటాయిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాల్లో సహేతుకమైన వాటిని పరిష్కరించి న్యాయం చేస్తామని చెప్పారు.

CONFUSION ON SCHOOLS CATEGORY


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad